భాష భద్రం.. ఆచారం శుద్ధం

తెనాలి: బెనె యాకోబ్‌ సినగాగె (సమాజ మందిరం) ఆంధ్రప్రదేశ్‌లో యూదుల ఏకైక ప్రార్థన మందిరం. చేబ్రోలు సమీపంలోని కొత్తరెడ్డిపాలెంలో నడుస్తోంది. వందల ఏళ్లుగా తెలుగు జనజీవన స్రవంతిలో ఈ యూదులు (ఇజ్రాయేల్‌ మూలాలు) కలిసిపోయారు. అయితే వారి మాతృభాష, ఆచార వ్యవహారాలను పరిరక్షిస్తున్న 'సమాజ మందిరం' నిర్వాహకుడు, ఏడుగురు పెద్దల నాయకత్వంలో అక్కడి 40 కుటుంబాల్లోని 300 మంది యూదులు తమ మూలాలను కాపాడుకుంటూ వస్తున్నారు.


క్రీస్తుపూర్వం 772, 445ల్లో టర్కీ, బాబిలోన్‌ దాడులతో చెల్లాచెదురైన ఇజ్రాయెలీల్లో కొందరు పర్షియా, ఆఫ్ఘనిస్తాన్‌ మీదుగా జమ్మూకశ్మీర్‌లోకి చేరుకున్నారు. కొందరు ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకొని, తెలంగాణలో స్థిరపడ్డారు. తర్వాత అమరావతి చేరుకుని జీవనం సాగించారు. బ్రిటిష్‌ హయాంలో ఒకరికి ఉపాధ్యాయ ఉద్యోగం రావడంతో మకాం కొత్తరెడ్డిపాలేనికి  మారింది. 1909లో పూరిపాకలో ఆరంభించిన సమాజ మందిరాన్ని, 1991లో రాతిగోడలతో రేకుల షెడ్డుగా పునర్ని   ర్మించారు. సిఖ్యా అనే యూదుడు రాజుకు బహూకరించిన దీపస్తంభం నేటికీ అక్కడి మ్యూజియంలో ఉందని, అమరావతిలో తమవారి జీవనానికి అదొక సాక్ష్యమని మందిరం నిర్వాహకుడు సాదోక్‌ యాకొబి చెప్పారు.  


రాష్ట్రంలో యూదు జాతీయులు మొత్తం 125 కుటుంబాలు జీవనం సాగిస్తున్నట్టు అంచనా. ఎలాంటి ప్రచారం లేకుండా మతాన్ని అనుసరిస్తుంటారు. ప్రభుత్వ రికార్డుల్లో 'మాదిగ'గా నమోదయ్యారు. బెనె ఎఫ్రాయిమ్‌ గోత్రాన్ని హిబ్రూలో 'మగద్దీన్‌' అంటారు. ఆ మాటతో వీరిని మాదిగ కులస్తులుగా నమోదు చేశారని చెబుతారు. 2004లోనే కొత్తరెడ్డిపాలెం యూదుల గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో ఇక్కడి యూదులను మట్టుపెట్టేందుకు కుట్రపన్ని, రెక్కీ నిర్వహించారనే ఆరోపణపై ప్రభుత్వం లష్కరేతోయిబాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేసింది. అప్పుడే జిల్లా కలెక్టరు, పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడకు వచ్చి వీరిగురించి తెలుసుకున్నారు.