‘అది ఎలా సాధ్యమవుతుందో.. నేనే నమ్మలేకున్నా’

కొలంబో:  ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో యార్కర్లు, స్లోబాల్స్‌ సంధించడంలో టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాది ప్రత్యేక స్థానం. ఆట ఆరంభంలో కానీ, చివర్లో కానీ మ్యాచ్‌ను శాసించడంలో బుమ్రా దిట్ట. కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించడంలో బుమ్రా ఎంతో పరిణితి సాధించాడు. దాంతోనే భారత క్రికెట్‌ జట్టులో రెగ్యులర్‌ బౌలర్‌గా మారిపోయాడు. తన అరంగేట్రం మొదలుకొని ఇప్పటివరకూ బుమ్రా బౌలింగ్‌ను విమర్శించిన దాఖలాలు దాదాపు లేవంటేనే అతని బౌలింగ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక సీనియర్‌ పేసర్‌ లసిత్‌ మలింగా నుంచి యార్కర్ల టిప్స్‌ను ఒక్కొక్కటిగా తెలుసుకున్న బుమ్రా.. ఇప్పుడు 'ముదురు' బౌలర్‌ అయిపోయాడు. ఎంతలా అంటే అసలు అంత కచ్చితమైన యార్కర్లు ఎలా వేస్తున్నాడో గురువు మలింగాకు తెలియనంతగా బుమ్రా రాటుదేలిపోయాడు.



ఇదే విషయాన్ని ఇప్పుడు మలింగ్‌ సైతం ఒప్పుకున్నాడు. ' అతని బౌలింగ్‌ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. బుమ్రా అంత కఠినమైన యార్కర్లను ఎలా సంధిస్తున్నాడు. అది ఎలా సాధ్యమవుతుందో.. దాన్ని నేనే నమ్మలేకున్నా. నేను బుమ్రా బౌలింగ్‌ మెరుగు పడటానికి కొన్ని సలహాలు ఇచ్చా. అందుకు చాలా సంతోషంగా ఉంది. తన బుర్రతో నేనిచ్చిన టిప్స్‌కు మరింత పదును పెట్టాడు. బుమ్రా ఏ విషయాన్నైనా తొందరగానే నేర్చుకుంటాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇద్దరం కలిసి ఆడటంతో బౌలింగ్‌ మెళకువలను నాతో షేర్‌ చేసుకునే వాడు. ఏదైనా చెబితే దాన్ని వెంటనే అమలు చేసేవాడు. నా కంటే మంచి ఫలితాల్ని రాబట్టడంలో బుమ్రా సక్సెస్‌ అయ్యాడు' అని మలింగా కొనియాడాడు. ఇక సీనియర్‌ క్రికెటర్లు యువ క్రికెటర్లకు సూచనలు ఇవ్వాల్సిన అవరసం ఉందని మలింగా తెలిపాడు. యువ క్రికెటర్లలోని సత్తాను బయటకు తీయాలంటే సీనియర్‌ క్రికెటర్లు వారికి తగిన సూచనలు ఇవ్వడానికి ఎప్పుడూ ముందుండాలన్నాడు.