అడిలైడ్: ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల సిరీస్ పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ షాకు మరొకసారి పీడకలగా మారిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రెండు టెస్టుల సిరీస్‌లో యాసిర్ షా ఇప్పటివరకూ ఇచ్చిన పరుగులు 402. ఒకవేళ ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం వస్తే యాసిర్ ఇంకా ఎన్ని పరుగులు సమర్పించుకుని చెత్త గణాంకాలను నమోదు చేస్తాడో చూడాలి.బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ కేవలం ఇన్నింగ్స్ మాత్రమే ఆడగా యాసిర్ షా 48.4 ఓవర్లు వేసి 205 పరుగులు ఇచ్చాడు. ఇక్కడ నాలుగు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇవ్వడంతో యాసిర్ షాది నామ మాత్రపు బౌలింగ్‌గానే మిగిలిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ తేడాతో గెలవడంతో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు.(ఇక్కడ చదవండి:ఏడుసార్లు ఔట్ చేస్తే మాత్రం..: అక్రమ్ చురకలు)
ఇక అడిలైడ్‌లో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో భాగంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను 589/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఇందులో డేవిడ్ వార్నర్(335 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ సాధించగా, లబూషేన్(162) భారీ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే యాసిర్ షా 32 ఓవర్లు వేసి 197 పరుగులు ఇచ్చాడు. అంటే రెండు టెస్టుల్లో కలిసి 80.4 ఓవర్లు వేసిన యాసిర్ షా 402 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో అతని బౌలింగ్ యావరేజ్ 100.5 గా ఉండగా, స్టైక్‌రేట్(వికెట్ తీయడానికి పట్టిన బంతులు) 121గా నమోదైంది. అడిలైడ్ టెస్టులో యాసిర్ షా 197 పరుగులిస్తే, అందులో వార్నర్ ఒక్కడే 111 పరుగులు సాధించడం ఇక్కడ గమనార్హం.2016-17 సీజన్‌లో ఆస్ట్రేలియాలో పర‍్యటించిన పాక్ జట్టులో సభ్యుడిగా ఉన్న యాసిర్ షా.. మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లోనే 207 పరుగులిచ్చాడు. ఇప్పుడు కూడా యాసిర్ షా బౌలింగ్‌ను ఆస్ట్రేలియన్లు ఆడేసుకోవడంతో అతను చెత్త గణాంకాలతో మరోసారి స్వదేశానికి వెళ్లనున్నాడు.